జగన్‌ సునామీ

ఉత్కంఠభరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ వైసీపీ అత్యంత భారీ విజయం సాధించింది. జిల్లాలకు జిల్లాల్ని ఏకపక్షంగా తన ఖాతాలో వేసుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం ఊహించని స్థాయిలో 50 శాతం ఓట్లతో 151 సీట్ల మార్కును చేరుకుంది. ముఖ్యమంత్రి కావాలన్న జగన్‌ దశాబ్ద కాల వాంఛ నెరవేరింది. వైఎస్‌ మరణానంతరం ఎనిమిదేళ్ల కిందట వైసీపీని ఏర్పాటు చేసి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా పట్టువీడక పోరాడిన జగన్మోహనరెడ్డి… నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30న విజయవాడలో పదవీ ప్రమాణం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తండ్రీ కొడుకులిద్దరూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇదే తొలిసారి కాగా పాదయాత్ర చేసిన నాయకుడు సీఎం కావడం ఇది మూడోసారి.తెలుగుదేశం మంత్రుల్లో కేవలం ముగ్గురంటే ముగ్గురే గట్టెక్కారు. లోకేశ్‌ సహా మిగతా మంత్రులు, స్పీకర్‌ కోడెల మట్టికరిచారు. స్వయంగా చంద్రబాబు సైతం కుప్పంలో ఒకదశలో వెనకబడి ఆ తర్వాత పుంజుకుని గెలిచారు. సినీ నటుడు, జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌కు ‘డబుల్‌ షాక్‌’ తగిలింది. ఆయన పోటీ చేసిన గాజువాక, భీమవరం… రెండు చోట్లా ఓడిపోయారు. ఒకేఒక్క జనసైనికుడు రాపాక వరప్రసాద్‌ మాత్రం రాజోలు నుంచి నెగ్గారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులను తుత్తునియలు చేసిన వైసీపీ… లోక్‌సభ పోరులో అంతకుమించి హోరెత్తించింది. 25 సీట్లకుగాను ఏకంగా 22 సొంతం చేసుకుంది. కడపటి వార్తలందేసరికి విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే టీడీపీ ఆధిక్యంలో నిలిచింది.

Related posts

Leave a Comment