ప్రజాతీర్పు శిరోధార్యం

K.Tarakaramarao-TRS

ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు శిరోధార్యమని, రాష్ట్రంలో ప్రజలు మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టారని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన బాస్‌లు లేరని చెప్పారు. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజలకు అంకితమై నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకొంటామని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌టీఎస్ చైర్మన్ రాకేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ ప్రజలు మరోసారి మెజార్టీ స్థానాలు కట్టబెట్టి హక్కులు సాధించుకొనే బాధ్యతను తమపైనే పెట్టారని కేటీఆర్ చెప్పారు. మెరుగైన ఫలితాలు రావాలని ఆశించామని.. 16 స్థానాల్లో గెలువడానికి టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారని తెలిపారు. తీవ్రమైన ఎండలోనూ రాష్ట్రమంతటా తిరిగామని, ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోదీకి పార్టీ తరుఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారని తెలిపారు. ఇంత పెద్ద ప్రక్రియను నిర్వహించడం కష్టతరమే అయినప్పటికి దిగ్విజయంగా పూర్తి చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి కితాబునిచ్చారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు తొమ్మిది స్థానాలు ఇచ్చారని, మిత్రపక్షం ఎంఐఎంను ఒక స్థానంలో గెలిపించారన్నారు. 

Related posts

Leave a Comment