జూన్ 6న కేర‌ళ‌కు రుతుప‌వ‌నాలు : ఐఎండీ

నైరుతీ రుతుప‌వ‌నాల ఆగ‌మ‌నం ఈసారి ఆల‌స్యంకానున్న‌ది. ఈ ఏడాది రుతుప‌వ‌నాలు జూన్ 6వ తేదీన కేర‌ళ‌లో ప్ర‌వేశిస్తాయ‌ని భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ‌(ఐఎండీ) ఆశాభావం వ్య‌క్తం చేసింది. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జూన్ ఒక‌ట‌వ తేదీన రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లో ప్ర‌వేశిస్తాయి. క‌స్ట‌మైజ్డ్ వెద‌ర్ మాడ‌ల్ ఆధారంగా ఐఎండీ ప్ర‌తి ఏడాది వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేస్తుంది. అయితే 2015లో ఒక‌సారి మాత్ర‌మే త‌మ అంచ‌నా త‌ప్పింద‌ని ఐఎండీ వెల్ల‌డించింది. మొత్తం ఆరు ప‌రిమితుల‌ను ఆధారం చేసుకుని వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేస్తామ‌ని ఐఎండీ చెప్పింది. వాయ‌వ్యంలో క‌నీస ఉష్ణోగ్ర‌త‌లు, ద‌క్షిణ ద్వీప ప్రాంతంలో రుతుప‌వ‌నాలకు ముందు కురిసిన వ‌ర్షం, ద‌క్షిణ చైనా స‌ముద్రంపై ఓఎల్ఆర్‌, హిందూమ‌హాస‌ముద్రంలో గాలుల తీరు లాంటి అంశాల ఆధారంగా రుతుప‌వ‌నాల‌ను అంచ‌నా వేయ‌డం జ‌రుగుతుంద‌ని ఐఎండీ చెప్పింది. త‌మ ద‌గ్గ‌ర ఉన్న వెద‌ర్ మోడ‌ల్ ఆధారంగా.. అంచ‌నాలో 4 రోజుల తేడా క‌న్నా ఎక్కువ తేడా ఉండ‌ద‌ని ఐఎండీ వెల్ల‌డించింది. జూన్ 6వ తేదీన రుతుప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయంటే.. అది జూన్ 2 నుంచి 10 మ‌ధ్య ఉంటుంద‌ని ఐఎండీ అభిప్రాయ‌ప‌డింది. నికోబార్ దీవుల్లో ప్ర‌స్తుతం నైరుతీ రుతుప‌వ‌నాల‌కు సంబంధించి అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు ఐఎండీ చెప్పింది. ఈసారి వ‌ర్ష‌పాతం సాధార‌ణంగానే ఉంటుంద‌ని ఐఎండీ అంచ‌నా వేస్తోంది. అయితే కేర‌ళ‌ను రుతుప‌వ‌నాలు జూన్ 4వ తేదీన తాకుతాయ‌ని మంగ‌ళ‌వారం స్కైమెట్ వాతావ‌ర‌ణ సంస్థ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Related posts

Leave a Comment