ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అభివృద్ధికి, ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య జరగలేదని, వ్యక్తిగత నిందారోపణలు, పరస్పర అభియోగాలు, నేతల మధ్య విభేదాలు ప్రాతిపదికన జరిగాయని తాను భావిస్తున్నట్టు నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా, “ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని భావిస్తున్నారు?” అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
తనకు ఏపీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్న విషయమై క్షేత్రస్థాయిలో అవగాహన లేదని, అయితే, అత్యధికులు చంద్రబాబుకు గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చని అంటున్నారని, ఇదే సమయంలో జగన్ చాలా ఎదిగారని చెబుతున్నారని అన్నారు. ఓ విజన్ ఉన్న నాయకుడైన చంద్రబాబు, తన విజన్ ను ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకు రాలేదని భావిస్తున్నట్టు చెప్పారు.