ఆరంభం.. అదుర్స్

priyanka gandhi

రాజు వెడలె రవి తేజములదరగా.. అనే రీతిలో కాంగ్రెస్ భవిష్యత్ ఆశాకిరణం, యువనేత ప్రియాంక గాంధీ (47) సోమవారం అట్టహాసంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అడుగుపెట్టారు. ఏఐసీసీ కార్యదర్శిగా, యూపీ తూర్పు ప్రాంత ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి యూపీకి వచ్చిన ప్రియాంకకు అడుగడుగునా పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. సాదాసీదా వస్త్రధారణతో, మోములో చిరునవ్వుతో, ఆద్యంతం కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ శ్రేణుల్లో ప్రియాంక జోష్ నింపారు. తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తలపించారు. సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమ యూపీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి బస్సు టాప్‌పై నిలబడి ప్రియాంక మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. లక్నోలోని చౌదరీ చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రోడ్‌షో భారీ ఎత్తున సాగింది. రండి.. అందరం కలిసి సరికొత్త భవిష్యత్‌ను నిర్మిద్దాం. వినూత్న రాజకీయాలకు శ్రీకారం చుడదాం.. ఈ మహాక్రతువులో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం.కృతజ్ఞతలు అంటూ లక్నోకు బయలుదేరే ముందు సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక గాంధీ పోస్టు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఇక్కడికి చేరుకున్నారు.

Related posts

Leave a Comment